వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా కొద్దిగా కరోనా లక్షణాలు కనబడటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని సోమవారం రిపోర్ట్ వచ్చింది. కనుక ఆయన హైదరాబాద్‌లో మంత్రుల క్వార్టర్స్‌లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. 

ఇటీవల వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డితో సహా ఆ శాఖలో పలువురు అధికారులు, ఉద్యోగులు కరోనాబారిన పడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి నిర్వహించే సమావేశాలలో వారిలో చాలామంది పాల్గొంటుంటారు కనుక వారిలో ఎవరి ద్వారానో మంత్రితో సహా పలువురికి కరోనా వైరస్ వ్యాపించి ఉండవచ్చు. వ్యవసాయశాఖలో పనిచేస్తున్నవారితో పాటు ఆ శాఖకు అనుబంద సంస్థలైన ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్ ఉద్యోగులలో కొంతమందికి కరోనా సోకింది. కనుక అందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.