సిఎం కేసీఆర్‌ సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌కు మద్దతుగా సిఎం కేసీఆర్‌ బుదవారం నల్గొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ సర్వత్రా వ్యాపిస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ లక్షమందితో బహిరంగ సభ నిర్వహించాలనుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ హైకోర్టు వాటన్నిటినీ కొట్టివేసింది. దీంతో సిఎం కేసీఆర్‌ సభకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. కనుక సిఎం సభకు టిఆర్ఎస్‌ నేతలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గురువారం సాయంత్రంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దానికి ఒక్కరోజు ముందు సిఎం కేసీఆర్‌ హాలియాలో నిర్వహించబోతున్న బహిరంగ సభ ప్రభావం సాగర్ ఓటర్లపై తప్పకుండా ఉంటుంది కనుక అది టిఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చవచ్చు. ఈసారి సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి ఉపఎన్నికల బరిలో దిగినందున కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే సిఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలో దిగుతునట్లు భావించవచ్చు. 

ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.