శుక్రవారం సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో వైఎస్ షర్మిల సంకల్పసభ పేరిట బహిరంగసభ నిర్వహించారు. దానిలో ఆమె మాట్లాడుతూ, “పోరాడి సాధించుకొన్న తెలంగాణ ఇప్పుడు సిఎం కేసీఆర్ నియంతృత్వపాలనలో నలిగిపోతోంది. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ కాలి కింద నలిగిపోతోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటున్నారు. అభివృద్ధి ఫలాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయి తప్ప ప్రజలకు దక్కడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాడే శక్తి ఎప్పుడో కోల్పోయింది. అది టిఆర్ఎస్కు ఎమ్మెల్యేలను అందించే ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. బిజెపి కూడా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారం చేజిక్కించుకోవడం కోసం అర్రులు చాస్తోంది తప్ప తెలంగాణ కోసం...ప్రజల కోసం అది చేసిందేమీ లేదు. రాష్ట్రంలో కేసీఆర్ దొరను ధైర్యంగా ప్రశ్నించేవాడే లేడు. అందుకే కేసీఆర్ నియంతృత్వాన్ని, అవినీతిని, టిఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను నిలదీసి ప్రశ్నించడానికే నేను వచ్చాను. తెలంగాణలోనే పుట్టిపెరిగి, ఇక్కడే జీవిస్తున్న నాకు తెలంగాణ పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉందని భావించే ఈ సంకల్పం తీసుకొన్నాను తప్ప నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. దివంగత వైఎస్సార్ జయంతి రోజున అంటే జూలై 8వ తేదీన నా కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా అన్నీ ప్రకటిస్తాను.
మీ అందరి కోసం కేసీఆర్ దొరను ధైర్యంగా ఎదిరించడానికి వచ్చిన నన్ను ఆశీర్వదించి వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపించి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తాను లేకుంటే మీ సమస్యల పరిష్కారం కోసం మీ అందరి తరపున ప్రభుత్వంతో నిరంతరం కొట్లాడుతూనే ఉంటాను. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయకుండా, కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తోంది. నిరుద్యోగులకు నేను అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతాను. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లో నిరాహారదీక్షలు చేస్తాను. అప్పటికీ ప్రభుత్వం లొంగకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మా అభిమానులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేస్తారు,” అని ఆమె మాటల సారాంశం.