
ఈనెల 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరుగబోతోంది. టిఆర్ఎస్ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న నాగార్జునసాగర్ పట్టణంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కె.జానారెడ్డి 2018 శాసనసభ ఎన్నికల తరువాత మళ్ళీ ఇంతవరకు నియోజకవర్గంవైపు తొంగిచూడలేదు. ఒకవేళ ఇప్పుడైనా ఈ ఎన్నికలలో పోటీ చేయకపోయుంటే వచ్చి ఉండేవారే కాదు. సమైక్య ప్రభుత్వంలో 14 ఏళ్ళు మంత్రిగా వ్యవహరించినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమీ లేదు. ఇటువంటి వ్యక్తిని గెలిపించి శాసనసభకు పంపిచడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది? అసలు తనకు ప్రజలు ఎందుకు ఓటేయాలో చెప్పగలరా? యువనేత, టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజాసమస్యలను కూడా పరిష్కరించగలరు. ముఖ్యంగా నెలికల్లు లిఫ్ట్ ఏర్పాటుచేయాలనే ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. సిఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. ప్రజలందరికీ ఏదో ఒక సంక్షేమ పధకం అందుతోంది. కనుక నోముల భగత్ కుమార్‌ను భారీ మెజార్టీత్ గెలిపించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నోముల భగత్ కుమార్ గెలవడం 100 శాతం ఖాయం. అయితే ఎంత మెజార్టీతో గెలుస్తాడనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నా అంచనాల ప్రకారం నోముల కనీసం 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని భావిస్తున్నాను,” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.