
సిఎం కేసీఆర్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు మెదక్ జిల్లాలోని వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కాలువ నుంచి హల్ది వాగు కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. తరువాత అక్కడి నుంచి ఉదయం 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తి చేరుకొని అక్కడ గజ్వేల్ కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల గోదావరి జలాలను సంగారెడ్డి కాలువ ద్వారా హల్దివాగులోకి విడుదల చేస్తే అవి మంజీరా మీదుగా 10 రోజులలో నిజాంసాగర్‌లోకి చేరుకొంటాయి. దారిలో చౌదరిపల్లి బంధం చెరువు, వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువు, అంబర్పేటకాని చెరువులను నింపుతూ హల్దివాగుకు చేరుకొంటాయి. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు తదితర ప్రాంతాలలో సుమారు 14,268 ఎకరాలకు ఏడాదిపొడవునా సాగునీరు అందుబాటులోకి వస్తుంది.