
ఖమ్మంలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌కు నేడు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద బస్టాండ్ ఇదే. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో నిర్మించిన ఈ బస్టాండ్‌లో మొత్తం 30 ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఒకేసారి 5-6,000 మంది ప్రయాణికులకు సరిపడేవిధంగా సువిశాలంగా అన్ని అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ కొత్త బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత బస్టాండ్ పట్టణం నడిబొడ్డున ఉండటంతో వచ్చిపోయే బస్సులతో ఆ పరిసర ప్రాంతాలలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. అప్పటి పట్టణ జనాభాకు సరిపడేవిధంగా కేవలం 2.50 ఎకరాలలో 15 ప్లాట్ఫారంలతో పాత బస్టాండ్‌ను నిర్మించడంతో ఇప్పుడు అది పెరిగిన జనాభాకు సరిపోవడం లేదు.
ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో ఖమ్మం బైపాస్ రోడ్డులో సువిశాలమైన, అత్యాధునిక సౌకర్యాలున్న ఈ కొత్త బస్టాండ్‌ను నిర్మించారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ కొత్త బస్టాండ్‌కు చేరుకొన్నారు. మరికొద్ది సేపటిలో ఖమ్మం కొత్త బస్టాండ్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు.