మావోయిస్ట్‌లకు సహకరిస్తున్న ఆరుగురు అరెస్ట్

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 31 ప్రాంతాలలో సోదాలు చేసి ఆరుగురు మావోయిస్ట్ మద్దతుదారులను అరెస్ట్ చేసింది. తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌తో సహా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో సోదాలు నిర్వహించగా, ఏపీలో శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలలో ఎన్ఐఏ బృందాలు సోదాలు జరిపాయి. ఏపీ నుంచి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

రెండు రాష్ట్రాలలో జరిపిన సోదాలలో మొత్తం 40 సెల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, ఆడియో, వీడియో టేప్స్, మావోయిస్ట్ సాహిత్యం, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నారు. మావోయిస్టులకు పోలీసులు, ప్రజా ప్రతినిధుల కదలికలకు సంబందించి సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.