
సాగర్ బిజెపి నేత కడారి అంజయ్య యాదవ్‌ను మంగళవారం టిఆర్ఎస్లో చేర్చుకొంటూ సిఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డికి ఈ ఉపఎన్నికలలో ఘోరపరాజయం తప్పదు. ఈ ఉపఎన్నికలు ఆయన రాజకీయ జీవితానికి ముగింపు కావచ్చు. ఆయన ఇక రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొని విశ్రాంతి తీసుకోవచ్చు.
దుబ్బాక ఉపఎన్నికలలో స్వల్ప తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోతే, ప్రతిపక్షాలు దానిని కొండంత చేసి చూపుతూ ప్రజలను ఆకట్టుకోవాలని చూశాయి. గ్రేటర్ ఎన్నికలలో కూడా దుష్ప్రచారాలతో టిఆర్ఎస్ను దెబ్బ తీయాలని చూశాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాటి సత్తా ఏపాటిదో తేలిపోయింది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నికలలో ప్రతిపక్షాలకు మరోసారి పరాభవం తప్పదు. ఈ ఉపఎన్నికలలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు. ఈ ఉపఎన్నికల తరువాత రాష్ట్రంలో మళ్ళీ ‘రాజకీయ పునరేకీకరణ’ జరుగనుంది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరుతారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాతో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా నిస్వార్ధంగా పనిచేసుకుపోతున్నాము. అయినా ప్రతిపక్షాలు నిత్యం మాపై బురదజల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అభివృద్ధికి సహకరించకపోగా అడ్డుకొనేందుకు కోర్టుల్లో, ట్రిబ్యూనల్స్‌లో కేసులు వేస్తూ అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నాయి. అయినా మేము ఏ మాత్రం వెనకడుగువేయకుండా వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్నాము. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని ప్రజలు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఇది నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో మరోసారి స్పష్టం కానుంది,” అని అన్నారు.