హైకోర్టులో పిటిషన్‌ వేసిన లక్ష్మీనారాయణ

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వరంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను అమ్మివేసి భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించుకొంది. దానిలో భాగంగా విశాఖపట్టణంలోని వైజాగ్ స్టీల్ ప్లాంటును కూడా అమ్మివేసేందుకు సిద్దపడింది. కానీ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఏపీ హైకోర్టులో ఈరోజు ఓ ప్రజాహిత పిటిషన్‌ దాఖలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలలో కూరుకుపోయిందంటూ కేంద్రప్రభుత్వం వదిలించుకోవాలని చూస్తోందని, కానీ దానికి ప్రత్యామ్నాయ వనరులు సమకూర్చినట్లయితే చాలా లాభసాటిగా నడిపించవచ్చని లక్ష్మినారాయణ తెలిపారు. ఈమేరకు కేంద్రప్రభుత్వానికి కూడా ఓ లేఖ వ్రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ అమ్మేయాలనే ఆలోచనపై పునరాలోచన చేయవలసిందిగా ఆయన కేంద్రప్రభుత్వాన్ని అర్ధించారు. 

అయితే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం వైఖరి చూసినట్లయితే అది ఒకసారి నిర్ణయం తీసుకొన్న తరువాత ఎట్టి పరిస్థితులలో తన నిర్ణయం మార్చుకొని వెనక్కు తగ్గబోదని అర్ధమవుతుంది. కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ అమ్మకం విషయంలోనూ అదే జరుగవచ్చు. అయితే ఇది ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణతో దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వరంగ సంస్థలను ఒకటొకటిగా అమ్మివేయడం ఖాయమనే భావించవచ్చు.