వరి రైతులకు శుభవార్త!

తెలంగాణలో వరి పండిస్తున్న రైతులకు ఓ శుభవార్త! ఈ యాసంగిలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు సిఎం కేసీఆర్‌ ఈరోజు నిర్ణయం తీసుకొని, వరి కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ధిక, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో గల 6,408 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోలుచేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

ఈరోజు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వ్యవసాయ, ఆర్ధిక, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, పౌరసరఫరాల శాఖ కమీషనర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అశ్వినీ గుప్తా తదితరులతో సమావేశమై ధాన్యం కొనుగోలుపై చర్చించారు. 

ధాన్యం కొనుగోలుకు రూ.20,000 కోట్లకు బ్యాంక్ గ్యారెంటీ కోసం రేపు సాయంత్రంలోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని సోమేష్ కుమార్‌కు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లోనే ఉండి నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణం పరిష్కరించాలని, కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని సిఎం కేసీఆర్‌ మంత్రులను, అధికారులను ఆదేశించారు.