ఏ పార్టీలో ఉన్నా నా అంతిమ లక్ష్యం అదే: కొండా

కాంగ్రెస్‌ పార్టీకి మూడు నెలలపాటు దూరంగా ఉంటానని చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజకీయ కార్యాచరణ గురించి వివరించారు. “కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరనే దానిపై నేను కాంగ్రెస్‌లో కొనసాగుతానా లేదా అనేది ఉంటుంది. నిజానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిఎం కేసీఆర్‌తో పోరాడలేనని భావించే ఈ నిర్ణయం తీసుకొన్నాను. నా ఏకైక లక్ష్యం సిఎం కేసీఆర్‌ను గద్దె దించడమే. అందుకు కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీకి శక్తిసామర్ధ్యాలు ఉన్నాయని భావిస్తే దానిలో చేరుతాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం వలననే టిఆర్ఎస్‌ అభ్యర్ధులు గెలిచారని నేను భావిస్తున్నాను. కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దె దించాలంటే ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ వంటి వారందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకురావడం చాలా అవసరమని భావిస్తున్నాను.

ఒకవేళ బిజెపి ఆ పని చేయగలదని నమ్మకం కలిగినా దానిలో చేరేందుకు నాకు అభ్యంతరం లేదు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఏ పార్టీ, ఏ వ్యక్తులు సమర్ధులనుకొంటే వారితో కలిసిపనిచేసేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఒకవేళ కేసీఆర్‌ స్థానంలో ఈటల రాజేందర్‌ లేదా హరీష్‌రావులలో ఎవరో ఒకరికి పగ్గాలు అప్పగించినా నేను నా పోరాటం విరమించుకొని టిఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నాను. గత 10 రోజులుగా ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నవంటి పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి ఈ అంశంపై చర్చించాను. మరో మూడు నెలలపాటు రాష్ట్రంలో అన్ని పార్టీలను, నేతలను కలిసి మాట్లాడి కొత్తగా పార్టీ పెట్టాలా… లేదా ఏదైనా పార్టీలో చేరాలా లేదా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలా? అనేది నిర్ణయించుకొంటాను. నా అంతిమ లక్ష్యం సిఎం కేసీఆర్‌ను గద్దె దించడమే,” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.