ఏప్రిల్ 30వరకు తెలంగాణలో వాటిపై నిషేదం

తెలంగాణలో మళ్ళీ కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో ఎక్కడా బహిరంగ సభలు, ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించరాదని వాటిపై తాత్కాలికంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది. 

రాబోయే నెల రోజుల్లో హోళీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగలున్నాయి. కనుక ఆయా పండుగల సందర్భంగా ఎవరూ బహిరంగ ప్రదేశాలలో సామూహికంగా ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఇంట్లో నుంచి కాలుబయటపెడితే చిన్నా, పెద్దా అందరూ విధిగా మస్కూలు ధరించాలని లేకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని తెలిపింది. ఈ ఆంక్షలన్నీ ఖచ్చితంగా అమలయ్యేలా చూసే బాధ్యత రాష్ట్ర పోలీసులదేనని స్పష్టం చేసింది. జిల్లాల కలెక్టర్లకు, నగర, మునిసిపల్, పోలీస్ కమీషనర్లకు, ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.