టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త!

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అది టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించదు కనుక వారు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజుకు 12-16 గంటలు కష్టపడుతున్న తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

ఇటీవల రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ శాసనసభలో మాట్లాడుతూ, టీఎస్‌ఆర్టీసీ మళ్ళీ నష్టాలలో కూరుకుపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు ఇచ్చినా అది అప్పులకే సరిపోయిందని కనుక కొత్తగా బస్సులు కొనలేమని, కొత్తగా బస్టాండ్లు నిర్మించలేమని చెప్పారు. తమకు కూడా తప్పకుండా జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు మంత్రి చేసిన ఈ ప్రకటనతో షాక్ అయ్యారు. 

కానీ ఈరోజు శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు చాలా కీలకపాత్ర పోషించారు. ఆ కృతజ్ఞతతోనే టీఎస్‌ఆర్టీసీ నష్టాలలో నడుస్తున్నప్పటికీ వారికి ఇబ్బంది కలగకుండా చూసుకొంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి రూ.3,000 కోట్లు ఇచ్చింది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీతాల పెంపుకోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. వారికీ తప్పకుండా త్వరలోనే జీతాలు పెంచుతాము. ఈ అంశంపై రవాణామంత్రిగారితో చర్చించి నిర్ణయం తీసుకొంటాను. కనుక టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని మనవి చేస్తున్నాను,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ చేసిన ఈ తాజా ప్రకటనతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా 30 శాతం పెంచే అవకాశం లేదనే భావించవచ్చు కనుక  ఏ మేరకు జీతాలు పెంచుతుందో చూడాలి.