తెలంగాణలో లాక్‌డౌన్‌పై సిఎం కేసీఆర్‌ ప్రకటన

రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటం, ఆ కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలన్నిటినీ తాత్కాలికంగా ప్రభుత్వం మూసివేయడంతో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో విద్యాసంస్థలను తప్పనిసరి పరిస్థితులలోనే మూసి వేయవలసి వచ్చింది. అది తాత్కాలికమే అయినా చాలా బాధతో కూడుకొన్న నిర్ణయమే. కరోనాను కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాము తప్ప ఎట్టి పరిస్థితులలో లాక్‌డౌన్‌ విధించబోము. కనుక ఎవరూ భయపడనవసరం లేదు. ఒకవేళ సినిమా హాల్స్ మూసేస్తే వేలకోట్లు పెట్టుబడులు పెట్టి తీస్తున్న సినిమాలు ఆర్ధాంతరంగా నిలిచిపోతాయి దాంతో వారు, వారితో పాటు  సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 4 లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే సినిమా హాల్స్ మూసివేయకూడదని నిర్ణయించాము. కరోనా కట్టడిలో దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే ముందుంది. ఈవిషయం కేంద్రప్రభుత్వమే చెప్పింది. కరోనా ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలీదు కానీ దానిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పుడు మనదగ్గరున్నాయి. కనుక ప్రజలు ఆందోళన చెందనవసరం లేదు. కానీ ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి,” అని అన్నారు.