
ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో లక్షమందితో ‘సంకల్ప సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్న వైఎస్ షర్మిళ, గురువారం లోటస్పాండ్ నివాసంలో ఉమ్మడి 10 జిల్లాల వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సంకల్ప సభ పోస్టర్’ విడుదల చేశారు.
ఆమె మీడియాను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,” ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు చేవెళ్ళలో పాదయాత్ర మొదలుపెట్టి అధికారంలోకి వచ్చారు. కనుక నేను కూడా ఆ సెంటిమెంటుతోనే ఏప్రిల్ 9న సంకల్ప సభ నిర్వహించబోతున్నాను. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. టిఆర్ఎస్, బిజెపిలతో స్నేహాలు, పొత్తులు పెట్టుకోకుండా వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని నమ్ముతున్నాను. నా భవిష్య కార్యాచరణ గురించి సంకల్ప సభలో పూర్తిగా వివరిస్తాను,” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిళలతో చేతులు కలిపిన సీనియర్ మహిళా నేత ఇందిరా శోభన్, వైసీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, పిత్తా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.