
ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ ఎస్ఎ బాబ్డే వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఆయన స్థానంలో ఎవరిని నియమించాలో తెలియజేయవలసిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జస్టిస్ బాబ్డేను లేఖ ద్వారా కోరగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించాల్సిందిగా కోరారు.
జస్టిస్ ఎన్వీ రమణ 1957, ఆగస్ట్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. న్యాయవాద డిగ్రీ పొందిన తరువాత 1983లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. జూన్ 2000 సం.లో ఉమ్మడి ఏపీ హైకోర్టుకు శాశ్విత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులందరిలోకి జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సీనియర్ కావడంతో జస్టిస్ బాబ్డే ఆయన పేరును ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి ఈ ఆనవాయితీనే పాటిస్తుంటారు కనుక జస్టిస్ ఎన్వీ రమణ భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడం లాంఛనమేనని భావించవచ్చు. ఓ తెలుగు వ్యక్తి దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోతుండటం తెలుగువారందరికీ గర్వకారణం.