సాగర్ ఉపఎన్నికలలో 400 మంది నామినేషన్లు?

వచ్చే నెల 17న జరుగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో అమరవీరుల కుటుంబాలకు చెందిన 400 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేయబోతున్నట్లు ‘తెలంగాణ అమరవీరుల ఐక్యవేదిక’ ప్రకటించింది. అమరవీరుల కుటుంబాలలో ఒక్కరికి ప్రభుత్వోద్యోగం, రూ.10 లక్షల ఆర్ధిక సాయం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఏడేళ్ళు కావస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరుతూ గత 5-6 ఏళ్ళుగా పోరాడుతున్నామని కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే తమ నిరసనలు తెలియజేసేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో 400 మంది నామినేషన్లు వేయబోతున్నట్లు తెలంగాణ అమరవీరుల ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు.  

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తం 1,386 మంది  బలిదానం చేసుకోగా వారిలో 543 మందినే ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మళ్ళీ వారిలో కేవలం 270 మందికి మాత్రమే ఉద్యోగాలు, ఆర్ధికసాయం అందజేసిందని, మిగిలిన 273 మందికి తగిన విద్యార్హతలు లేనందున ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందజేసి చేతులు దులుపుకొందని రఘుమారెడ్డి ఆరోపించారు. మిగిలిన 843 కుటుంబాలను అసలు పట్టించుకొనేలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ఒక్క నల్గొండ జిల్లా నుంచే తెలంగాణ అమరవీరుల ఐక్యవేదికకు చెందిన 70 మంది నామినేషన్ పత్రాలు తీసుకొన్నారు. మొత్తం 400 మంది నామినేషన్లు వేస్తారని రఘుమారెడ్డి తెలిపారు. తమకు ఉస్మానియా యూనివర్సిటీ దళితసంఘాల జెఏసీ, తెలంగాణ యూత్ ఫోర్స్, తెలంగాణ బతుకమ్మ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న వైఎస్ షర్మిళ కూడా తమకు మద్దతు తెలుపాలని తెలంగాణ అమరవీరుల ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు.