పార్టీ ముఖ్యమా... పదవులు ముఖ్యమా?

ఇల్లు తగలబడిపోతోందని ఒకడు బాధ పడుతుంటే చుట్టకు నిప్పు దొరికిందని సంతోషపడ్డాడుట మరొకడు. తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి అలాగే ఉందిప్పుడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి దిగజారిపోవడంపై ఆత్మవిమర్శ చేసుకోకుండా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు భారీగా బీసీ ఓట్లు పడ్డాయి కనుక పిసిసి అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలని వి.హనుమంతరావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే పిసిసి పగ్గాలు బీసీలకు అప్పగించాలని కోరారు. అంటే పిసిసి రేసులో ఉన్న తనకు ఆ పదవి ఇవ్వమని పరోక్షంగా కోరుతున్నట్లు భావించవచ్చు.

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఓ ప్రహసనంగా మారి, పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం కనబడటంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికల వంకతో దానిని నిలిపివేసి తాత్కాలికంగా సమస్యను వాయిదా వేసుకొన్నారు. అందుకే వి.హనుమంతరావు వంటి నేతలు పదవుల కోసం ఇటువంటి వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఆయన వంటి సీనియర్లు సైతం పార్టీని ఏవిదంగా కాపాడుకోవాలని ఆలోచించకుండా పదవుల కోసం ఆరాటపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రేపు పార్టీయే కనబడకుండా పోతే అప్పుడు పదవులు ఎలా ఉంటాయి?అని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆలోచించి ఇప్పటికైనా మేల్కొంటే మంచిది లేకుంటే చివరికి వారే నష్టపోతారు.