
ఈసారి తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు సిఎం కేసీఆర్ ఈరోజు శాసనసభలో ప్రకటించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61 ఏళ్ళకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది తక్షణం అమలులోకి వస్తుందని, వేతన సవరణ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో 9,17,797 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు లబ్ది పొందనున్నారని తెలిపారు.
ప్రభుత్వోద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, హోంగార్డులు, విద్యావాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, సెర్ఫ్ సిబ్బంది, వీఏఓ, వీఆర్ఏ, సర్వశిక్షా అభియాన్, గ్రాంట్ ఇన్‌స్టిట్యూట్ ఎయిడ్ వర్కర్లు, డెయిలీ వేజ్ వర్కర్లకు కూడా జీతాలు పెంచుతున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు.
వేర్వేరు జిల్లాలలో ఉద్యోగాలుచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు బదిలీ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. కేజీబీవిలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రసూతీ శలవులు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పాఠశాలలో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉపాధ్యాయులు తమ సొంత రాష్ట్రానికి వెళ్లాలనుకొంటే అనుమతిస్తామని తెలిపారు. పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 75 నుంచి 70 ఏళ్ళకు తగ్గిస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు. కరోనా కారణంగా వేతన సవరణ ఆలస్యమైంది తప్ప ఉద్యోగులను బాధ పెట్టాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని సిఎం కేసీఆర్ అన్నారు.