26.jpg)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సిఎం కేసీఆర్ నేడు శాసనసభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్ధులు గెలవడంతో చాలా సంతృప్తిగా ఉన్న సిఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్‌లో సమావేశమై పీఆర్సీపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పీఆర్సీ ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. కనుక సిఎం కేసీఆర్ ఈరోజు శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
నిన్న సాయంత్రం సిఎం కేసీఆర్‌ను కలిసివచ్చిన తరువాత ఉద్యోగ సంఘాల నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు మరో ఒకటి రెండు శాతం ఎక్కువే ఇవ్వబోతున్నారని నమ్మకంగా చెపుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే చెప్పిన దాని కంటే ఒక్క శాతం ఎక్కువే ఇస్తారని భావించవచ్చు. అంటే కనీసం 30 శాతం పీఆర్సీ ప్రకటించడం ఖాయమనే భావించవచ్చు. కనుక దీని కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నేడు చాలా శుభదినమే అవుతుంది.