ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులే విజయం సాధించారు. అభ్యర్ధులందరి ఎలిమినేషన్ తరువాత సురభి వాణీదేవికి 1,89,339కి ఓట్లు రాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,61,811 ఓట్లు వచ్చాయి. వారిలో సురభి వాణీదేవికి మ్యాజిక్ ఫిగర్‌కి అవసరమైన దానికంటే 20,189 ఓట్లు ఎక్కువ రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మ్యాజిక్ ఫిగర్‌కి అవసరమైన ఓట్లు రాలేదు కానీ తన సమీప ప్రత్యర్ధి తీన్మార్ మల్లన్న కంటే 12,806 ఓట్లు అధికంగా వచ్చినందున ఆయనను విజేతగా ప్రకటించారు. 

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బిజెపి, కాంగ్రెస్‌ అభ్యర్ధుల కంటే తీన్మార్ మల్లన్నకు ఎక్కువ ఓట్లు పడటం విశేషం. ఆయన 1,49,005 ఓట్లు సాధించి చివరివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. మరో విదంగా చెప్పాలంటే మల్లన ఓడి గెలిచినట్లు చెప్పుకోవచ్చు. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నుంచి పోటీ చేసిన ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరూ కూడా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఎలిమినేషన్ అయ్యారు.