
ఒకప్పుడు రాజకీయపార్టీలు ప్రజాసేవ, పరిపాలన కోసం ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు ఏమాత్రం మొహమాటం పడకుండా అధికారం సాధించడమే తమ లక్ష్యమని చెపుతుంటే వాటి నాయకులు పదవులు, అధికారమే తమ లక్ష్యమని చెపుతున్నారు. ఆ పదవులు...అధికారంతో ఏమి చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యం, ప్రజాసేవల గురించి వెతకడం నేతి బీరకాయలో నెయ్యిని ఆశించడమే అవుతుంది.
ద అసోసియేషన్ ఆఫ్ డెమొక్రేటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా 10 ప్రాంతీయ పార్టీల ఆస్తిపాస్తుల విలువను లెక్కగట్టి ప్రకటించింది. ఆ నివేదిక ప్రకారం యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ రూ. 572 కోట్లు, ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ రూ. 232 కోట్లు, తమిళనాడులోని అన్నాడీఎంకె పార్టీ రూ. 206కోట్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని టిడిపి రూ.193 కోట్లు, తెలంగాణలోని టిఆర్ఎస్ ఆస్తుల విలువ రూ.188 కోట్లు, ఏపీలో వైసీపీ ఆస్తుల విలువ రూ.93 కోట్లు అని లెక్క తేల్చింది.