రెండు నియోజకవర్గాలలో ఆధిక్యతలో టిఆర్ఎస్‌

ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయపదంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం ఉదయానికి రెండు నియోజకవర్గాలలో 5 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. రెండు చోట్ల టిఆర్ఎస్‌ అభ్యర్ధులే ఆధిక్యతలో ఉన్నారు. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో 5 రౌండ్లు ముగిసేసరికి సురభి వాణీదేవి తన సమీప బిజెపి ప్రత్యర్ధి రామచందర్ రావు కంటే 6,555 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆమెకు 88,304 ఓట్లు, రామచందర్ రావుకు 81,749, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 42,604, చిన్నారెడ్డికి 24,440 ఓట్లు పోలయ్యాయి. 

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో 5వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 83,290, ప్రొఫెసర్ కోదండరాంకు 70,072 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి తీన్మార్ మల్లన్నపై 27,550 ఆధిక్యతలో ఉన్నారు.

రెండు చోట్ల ఏ ఒక్క రౌండ్‌లో మిగిలిన అభ్యర్ధులు ఆధిక్యత సాధించలేకపోయారు. మొదటి నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధులే స్పష్టమైన ఆదిక్యతలో కొనసాగుతున్నారు. కనుక రెండు నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులు విజయం సాధిచడం దాదాపు ఖాయమనే భావించవచ్చు.