తెలంగాణలో 8వ తరగతి వరకు మళ్ళీ బంద్?

తెలంగాణలో కొన్ని జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్దులు కరోనా బారిన పడుతుండటంతో 8వ తరగతి వరకు ప్రత్యక్ష పద్దతిలో భోదన నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సిఎం కేసీఆర్‌ ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న శాసనసభలో మాట్లాడుతూ దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి పైతరగతుల విద్యార్దులు పాఠశాలలు, కాలేజీలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.     

ఇప్పటికే కరీంనగర్‌, మంచిర్యాల్ జిల్లాలలో కొందరు విద్యార్దులు కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్మల్ జిల్లాలోని భైంసాలోని జాంగాం గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్దులకు కరోనా సోకింది. కుమురంభీం జిల్లాలో నజ్రూల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి, కాగజ్‌నగర్‌ బాలికల హాస్టల్‌లో ఇద్దరు విద్యార్ధినులకి కరోనా సోకినట్లు అధికారులు దృవీకరించారు. 

విద్యార్దులు, ఉపాధ్యాయులు, సిబ్బందిలో ఎవరికి కరోనా సోకినా వారి ద్వారా మిగిలినవారందరికీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అంతేగాక వారి కుటుంబాలకు, చుట్టుపక్కల వారికీ కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కనుక త్వరలోనే పాఠశాలలు మూసివేసి మళ్ళీ ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభించే అవకాశం ఉంది.