.jpg)
ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో
భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
“గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి
చెందిందని కితాబు ఇచ్చారు. బాగానే ఉంది. వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో నష్టం జరుగుతుందని
చెపుతూ మీ ప్రభుత్వం, మీ పార్టీ వ్యతిరేకించింది. కానీ నేటికీ
ఢిల్లీలో రైతులు వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు?వ్యవసాయ చట్టాలను వ్యతికిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి
పంపించాలి,” అని డిమాండ్ చేశారు.
సిఎం కేసీఆర్ స్పందిస్తూ, “వ్యవసాయ చట్టాలపై మా
ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో ఇదివరకే పార్లమెంటులో, బయటా కూడా చాలా
స్పష్టంగా చెప్పాము. కనుక మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. కనుక దాని గురించి ఇక్కడ మాట్లాడటం
కంటే మీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడితే మంచిది,”
అని సమాధానం ఇచ్చారు.
వ్యవసాయ చట్టాలను మొదట్లో గట్టిగా వ్యతిరేకించిన సిఎం కేసీఆర్, ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసివచ్చిన తరువాత ఆ ప్రస్తావన చేయడం మానుకొన్నారు. ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష సభ్యుడు అడిగితే ‘ఇక్కడ కాదు ఢిల్లీ వెళ్ళి పార్లమెంటులో మాట్లాడుకోండి,’ అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వ్యవసాయ చట్టాలపై టిఆర్ఎస్ వైఖరి మారిందనుకోవాలా?