
నల్గొండ కౌంటింగ్ కేంద్రంవద్ద ప్రతిపక్షాల ఏజంట్లు ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రంలోని 6,7,8వ నెంబర్ కౌంటర్లకు తీసుకువచ్చిన కొన్ని బ్యాలెట్ బాక్సుల తాళాలు పగిలి ఉండటం, కొన్ని బాక్సులు కొద్దిగా తెరుచుకొని ఉండటంతో ప్రతిపక్షాల కౌంటింగ్ ఏజంట్లు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. కానీ వాటి తాళాలు బిగుసుకుపోవడంతో ఏజంట్ల ఎదురుగానే తాళాలు పగులగొట్టి తెరిచామని రిటర్నింగ్ అధికారులు చెపుతున్నారు. కొంతసేపు తరువాత ఏజంట్లు శాంతించడంతో మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు రాత్రంతా ఓట్ల లెక్కింపు జరుగనుంది కనుక రాత్రి 8 గంటల వరకు పనిచేసిన సిబ్బంది స్థానంలో మరో బ్యాచ్ పనిచేయనుంది. అర్ధరాత్రి దాటిన తరువాత లేదా రేపు ఉదయానికి ఫలితాలు క్రమంగా వెల్లడయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.