కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటిది హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలోనూ రెండోది నల్గొండలోఆర్జాలబావి వద్దగల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములలో లెక్కింపు జరుగుతోంది. 

మిగిలిన ఎన్నికలలో ఎవరికి ఎక్కువ ఓట్లు పోలైతే వారిని విజేతగా ప్రకటిస్తారు కానీ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేస్తారు కనుక వాటి లెక్కింపు కూడా భిన్నంగా సాగుతుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి 1వ నెంబర్ ఇవ్వడం ద్వారా తొలి ప్రాధాన్యత ఓటును వేస్తారు. మిగిలిన అభ్యర్ధులలో నచ్చినవారున్నట్లయితే వారికి వరుసగా 2,3,4,5… ఇలా నెంబర్లు ఇస్తారు.  లెక్కింపు ప్రక్రియలో ముందుగా చెల్లనిఓట్లు గుర్తించి వేరు చేస్తారు. ఆ తరువాత తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించి, పోలైన ఓట్లలో ఎవరికైతే 50 శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు మొత్తం 1,000 ఓట్లు పోలైయ్యాయనుకొంటే, అభ్యర్ధులలో ఎవరికి 501 లేదా అంతకంటే ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తే వారే విజేత అవుతారు. 

ఒకవేళ ఎవరికీ 50 శాతం తొలి ప్రధాన్యత ఓట్లు పడకపోతే అప్పుడు ఎలిమినేషన్ పద్దతిని పాటిస్తారు. అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు పొందిన అభ్యర్ధి బ్యాలెట్ పేపర్లోని రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కగట్టి వాటిని ఎక్కువ తొలి ప్రధాన్యత ఓట్లు పొందిన అభ్యర్ధుల ఖాతాలో కలిపి మళ్ళీ లెక్కించి చూస్తారు. ఆవిధంగా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ చివరికి గెలిచిన అభ్యర్ధిని ప్రకటిస్తారు. ఇటువంటి క్లిష్టమైన ప్రక్రియ కారణంగా ఓట్ల లెక్కింపు మెల్లగా కొనసాగుతూ ఫలితాలు వెలువడేసరికి ఆలస్యం అవుతుంటుంది.  

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రెండు చోట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ రెండు స్థానాలకు భారీగా అభ్యర్ధులు పోటీ పడటం, లెక్కింపు ప్రక్రియలో క్లిష్టత కారణంగా మందకొడిగా లెక్కింపు కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుంచి ఆధిక్యతలు వెలువడే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.