చంద్రబాబునాయుడుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి ఏపీ సీఐడీ అధికారులు నోటీస్‌ అందజేశారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్ళి ఈరోజు ఉదయం నోటీస్ అందజేశారు. ఆయన హయాంలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఏపీ సీఐడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు టిడిపిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు ముందుగా ఆ సమాచారం తెలియజేయడం ద్వారా వారు కారుచవుకగా వేల ఎకరాలు కొనుగోలు చేశారని, ఇది ఇంసైడ్ ట్రేడింగ్ చేయడమేనని అధికార వైసీపీ వాదిస్తోంది. ఆ వ్యవహారంలోనే చంద్రబాబునాయుడుతో సహా గతంలో ఆయన మంత్రివర్గంలో పనిచేసిన నారాయణకు మరో ఆరుగురు టిడిపి నేతలకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తాజా సమాచారం. ఈ నెల23న అమరావతిలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో జరుగబోయే ఈ కేసు విచారణకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని నోటిసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో విచారణకు హాజరయ్యేవారిని సీఐడీ అధికారులు ప్రశ్నించి విడిచిపెట్టవచ్చు లేదా అభియోగాలు మోపి అరెస్ట్ చేయవచ్చు. కనుక చంద్రబాబునాయుడు విచారణకు హాజరవుతారా లేదా హైకోర్టును ఆశ్రయిస్తారా? అనేది రానున్నరోజులలో తెలుస్తుంది. ఏపీలో తమ పార్టీతో వైసీపీకి ఎదురులేకుండా చేసుకొనేందుకే జగన్ ప్రభుత్వం ఈవిదంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు వాదిస్తున్నారు.