
తెలంగాణలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 64.87 శాతం, వరంగల్-నల్గొండ-ఖమ్మంలో 76.35 శాతం పోలింగ్ నమోదైంది. రెండు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 70.61 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈసారి రెండు నియోజకవర్గాలలో ఎక్కువమంది అభ్యర్ధులు పోటీ పడటంతో దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఆ కారణంగానే పోలింగ్ మెల్లగా సాగింది. అయినప్పటికీ ఓటర్లు ఓపికగా ఎండలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి రెండు నియోజకవర్గాలలో చాలా మంది ఓట్లర్లు క్యూలైన్లలో నిలబడి ఉండటంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
నిన్న పోలింగ్‌కు ముందు వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గం పరిధిలో కొన్ని చోట్ల టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మద్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. బిజెపి అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి తనపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రెండు నియోజకవర్గాలలో ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. బుదవారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.