వైజాగ్ స్టీల్ కాదు...నిజాం షుగర్స్ గురించి మాట్లాడు: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో అధికార టిఆర్ఎస్‌, ప్రతిపక్ష బిజెపిల మద్య ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగాయి. ఇవి పట్టభద్రుల స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు కనుక సహజంగానే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పరిశ్రమలు తదితర అంశాల చుట్టూ చర్చలు జరిగాయి. 

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక తడబడుతున్న టిఆర్ఎస్‌కు, ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ చేసిన తాజా ప్రకటన సమయానికి బలమైన ఆయుధం అందించినట్లయింది. ముందుగా ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు సిద్దపడటం... దానిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలవడం కూడా ఈ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్‌కు బాగా కలిసివచ్చింది. 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వైజాగ్‌లో జరుగుతున్న ఆ ఆందోళనలకు వెంటనే మద్దతు ప్రకటించారు. దాంతో హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాలో స్థిరపడిన ఆంద్రా ఓటర్లు ప్రభావితులవుతారని గుర్తించిన కాంగ్రెస్‌, బిజెపిలు వెంటనే టిఆర్ఎస్‌పై ఎదురుదాడి మొదలుపెట్టాయి. తెలంగాణ సమస్యలను, హామీలను పట్టించుకోకుండా ఏపీలో సమస్యలను తీర్చడానికి సిద్దమయ్యారంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టాయి. తెలంగాణలో మొదటిసారి టిఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న సిఎం కేసీఆర్‌, ఇంతవరకు దానిని ఎందుకు తెరిపించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ముందు దానిని తెరిపించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.   

బిజెపి విమర్శలకు మంత్రి కేటీఆర్‌ ధీటుగానే బదులిచ్చారు. ‘నేడు ఏపీలో పరిశ్రమలను మూస్తున్న కేంద్రప్రభుత్వం రేపు తెలంగాణలో సింగరేణి తదితర పరిశ్రమలను మూయకుండా ఉంటుందా? అందుకే పోరాడుతున్నాము,’ అని జవాబిచ్చారు.