నేడు విశాఖ ఉక్కు... రేపు సింగరేణి: కేటీఆర్‌

శుక్రవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హరితప్లాజాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌, బిజెపి విమర్శలను తిప్పి కొట్టారు. “విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే బిజెపి ఎందుకు ఉలిక్కి పడుతోంది?ఏం విశాఖపట్నం భారత్‌లో లేదా...మేము భారతీయులంకామా?మేము ముందు భారతీయులం ఆ తరువాతే తెలంగాణవాసులం. కనుక దేశంలో ఎక్కడ ఏ తప్పు జరుగుతున్నా ఓ భారతీయుడిగా కేంద్రాన్ని నిలదీసి అడిగే హక్కు మాకుంది. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని నిర్భయంగా చెప్పాను. 

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానన్న కేంద్రప్రభుత్వం, అది పెట్టలేదు కానీ విశాఖలో ఎప్పుడో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్‌ని మూసేయడానికి సిద్దపడుతోంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మూస్తోంది... రేపు సింగరేణి.. ఎల్లుండి బీహెచ్ఈల్‌ మూసేస్తుంది. కనుక కేంద్రప్రభుత్వ నిర్ణయాలను ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా రేపు అమ్మేస్తుంది. అప్పుడు నష్టపోయేది మనమే. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటించాము. 

ఐడిపీఎల్‌ను ఖతం చేసిన కేంద్రప్రభుత్వం దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకోమని మాకే సలహా ఇస్తోంది సిగ్గులేకుండా. దేశంలో ఉద్యోగాల కల్పన దేవుడెరుగు... ఉన్న కంపెనీలన్నిటినీ అయినకాడికి అమ్ముకొని మూసేస్తూ వాటిలో పనిచేస్తున్న లక్షలాదిమందిని రోడ్డున పడేస్తోంది కేంద్రప్రభుత్వం. ఇదేనా మోడీ ప్రభుత్వం ఆరున్నరేళ్ళలో సాధించిన ఘనత?” అంటూ మంత్రి కేటీఆర్‌ కేంద్రప్రభుత్వం, బిజెపిలపై నిప్పులు చెరిగారు.