నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 14న పోలింగ్ జరుగనుంది కనుక ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నేటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు జంటనగరాలలో మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆదేశించారు. అలాగే నగరంలోని బార్లు, స్టార్ హోటల్స్‌లోని బార్లను కూడా మూసివేయాలని, పోలింగ్ ముగిసేవరకు మిలటరీ క్యాంటీన్లలో కూడా మద్యం అమ్మకాలను నిషేధిస్తునట్లు అంజనీ కుమార్ తెలిపారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్‌ తరపున సురభి వాణీదేవి, బిజెపి అభ్యర్ధిగా ఎన్‌.రాంచందర్ రావు, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా చిన్నారెడ్డి, టిడిపి అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, వామపక్షాల మద్దతుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు.

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రాములు నాయక్, టిజేఎస్‌ అభ్యర్ధిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్: 

మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.