ఆర్ధికమంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ గురించి ఏమన్నారంటే...

ఈనెల 15వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18న ఆర్ధికమంత్రి హరీష్‌రావు 2021-2022 సం.ల బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తలక్రిందులైపోవడంతో ఉద్యోగుల జీతాలలో కోత విధించవలసి వచ్చింది. అభివృద్ధి, సంక్షేమ పధకాలకు నిధులు కేటాయించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో ఈఏడాది బడ్జెట్‌ ఏవిదంగా ఉండబోతోందోనని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మంత్రి హరీష్‌రావు నిన్న ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బడ్జెట్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడింది. గత రెండు నెలల వృద్ధిరేటు కూడా బాగుంది. కనుక ఈసారి బడ్జెట్‌లో ఎటువంటి కోతలు ఉండబోవు. ఈసారి బడ్జెట్‌ పాజిటివ్‌గా ఉండబోతోంది. అభివృద్ధి, సంక్షేమ పధకాలకు యధాప్రకారం నిధులు కేటాయించబోతున్నాము. సిఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించాము,” అని చెప్పారు.