నేటి నుంచి దేశవ్యాప్తంగా స్వాతంత్రోత్సవాలు

వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సం.లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి 75 వారాలపాటు దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కనుక ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో సిఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రంలో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర మంత్రులు, అధికార, ప్రతిపక్షా పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. కనుక ఈరోజు ఉదయం నుంచి పబ్లిక్ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీగా పోలీసులు మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ఈ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన ప్రాంతాలలో 75 భారీ త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌ను మువ్వన్నెల జెండా రంగులు వెదజల్లే విద్యుదీపాలతో అందంగా అలంకరించారు.