తోపులాటలో సిఎం మమతా బెనర్జీకి గాయాలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుదవారం నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బిజెపి కార్యకర్తలు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో మమతా బెనర్జీ క్రిందపడిపోవడంతో ఆమె కాలికి గాయం అయ్యింది. వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు, ఆమె ఎడమకాలు చీలమండ, భుజం ఎముకకు గాయాలైనట్లు తెలిపారు. మరో 48 గంటలు పరిశీలనలో ఉంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. 

ఈసారి పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో బిజెపి నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుండటంతో మమతా బెనర్జీ నిర్విరామంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నందున నిన్న ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. 

ఈ ఎన్నికలలో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించబోతోందని సర్వేలన్నీ తేల్చి చెప్పడంతో బిజెపి ఓటమి భయంతో ఇటువంటి నీచమైన పనులకు పూనుకొంటోందని, కానీ తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి కార్యకర్తలు భౌతికదాడి చేయడానికి ప్రయత్నించినందుకు బెంగాల్ ప్రజలు ఈ ఎన్నికలలో బిజెపికి తప్పకుండా గుణపాఠం నేర్పిస్తారని ఆ తృణమూల్ నేతలు అన్నారు.