
బుదవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్ళు గడిచినా వాటిని ఏర్పాటుచేయకపోగా ఇప్పుడు ఉన్నవాటిని కూడా అమ్మేస్తామని చెపుతోంది. కనుక సెయిల్ (స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా) అధ్వర్యంలో మేమే బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తాం. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్కడ మన సోదరులు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇస్తాం. అవసరమైతే నేను కూడా విశాఖకు వెళ్ళి ఆ పోరాటంలో పాల్గొంటాను. కేంద్రప్రభుత్వం ఈవిదంగా ప్రభుత్వ రంగసంస్థలను అమ్మడం మొదలుపెడితే రేపు బీహెచ్ఈఎల్‌ను అమ్ముతుంది..ఆ తరువాత సింగరేణిని కూడా అమ్మేస్తుంది. అప్పుడు వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ కలిసి కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది,” అని అన్నారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ల మద్య గత కొంతకాలంగా దూరం పెరిగినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఇటువంటి ప్రతిపాదన చేయడం చాలా అభినందనీయం. ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది.