
తమిళనాడు సినీ పరిశ్రమ నుంచి అనేకమంది నటీనటులు రాజకీయాలలోకి వచ్చి రాణించారు. తాజాగా యాక్షన్ హీరో అర్జున్ కూడా రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం తమిళనాడు బిజెపి ఇన్‌ఛార్జ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లను చెన్నైలో కలిశారు. సుమారు అర్ధగంటకు పైగా వారి సమావేశం సాగింది.
కిషన్‌రెడ్డి తన చిరకాల స్నేహితుడని, ఆయన చెన్నై వచ్చినందున మర్యాదపూర్వకంగా కలిశానని అర్జున్ చెప్పారు. కానీ ఈసారి తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకె పార్టీ గెలవబోతోందని సర్వేలన్నీ తేల్చి చెప్పడంతో అధికార అన్నాడీఎంకె పార్టీ...దానితో పొత్తులు పెట్టుకొన్న బిజెపి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. శశికళతో పొత్తులకు అన్నాడీఎంకె నేతలను ఒప్పించడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. కనుక తమిళనాడులో మంచి పేరున్న నటుడు అర్జున్‌ను బిజెపిలోకి రప్పించడం లేదా బిజెపి-అన్నాడీఎంకె కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ భేటీ జరిగి ఉండవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.