సిద్ధిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు జైలు శిక్ష!

అవును... సిద్ధిపేట జిల్లా కలెక్టర్లుగా పని చేసిన పి.వెంకటరామిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఈ శిక్షలు వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పులో పేర్కొన్నారు.  

 సిద్ధిపేట జిల్లాకు రెండుసార్లు కలెక్టర్‌గా పని చేసిన పి.వెంకటరామిరెడ్డి 3 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. ఈ కేసులో పిటిషనర్లకు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.25,000 చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఇదే కేసులో ఆర్డీవో జయచంద్రారెడ్డికి 4 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.50,000 చెల్లించాలని ఆదేశించింది. వీరిరువురి సర్వీస్ రికార్డులలో వీటిని నమోదుచేయాలని హైకోర్టు ఆదేశించింది.  

2018-19లో సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసిన పనిచేసిన కృష్ణ భాస్కర్‌కు కూడా ఇదే కేసులో హైకోర్టు రూ.2,000 జరిమానా విధించింది. వీరు ముగ్గురూ సుప్రీంకోర్టు అప్పీలు చేసుకొనేందుకు 6వారాలు గడువు ఇచ్చింది. అంతవరకు వారికి జైలు శిక్ష, జరిమానా ఉత్తర్వులు అమలుచేయకుండా నిలిపి ఉంచుతున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్లతో సహా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పులో పేర్కొన్నారు.  

వారికి ఈ శిక్షలు విధించడానికి కారణాలు: 

• కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో రైతులకు అర్ధమయ్యే విదంగా తెలుగులో ఉత్తర్వులు అందజేయాలని హైకోర్టు సూచనలను పట్టించుకోకపోవడం. 

• భూసేకరణ చేసిన రెండేళ్ల తరువాత డిక్లరేషన్, అవార్డు జారీ చేయడం. ఈ సందర్భంగా దానిని హైకోర్టు కొట్టివేసింది.  

• భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు పునరావాస, పునర్మాణ ప్యాకేజీని ఇవ్వడంలో అధికారుల అలసత్వం. 

• హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భూసేకరణ చేయడం. 

• భూస్వరూపాన్ని మార్చవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకపోవడం. 

• భూసేకరణ చేసి చేయలేదని కోర్టును తప్పు దోవ పట్టించడం.

• ఆ భూమిని తిరిగి రైతుకు అప్పగించాలని కోర్టు ఆదేశిస్తే, వేరొకరి భూమిని అప్పగించడం.