మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. మర్నాడు ఉభయసభలు సమావేశమవగానే మొదట ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. తరువాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవధాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. మార్చి 18న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో 2021-22 సం.లకు సంబందించిన ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి కనీసం 15 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. శాసనసభ సమావేశాలకు ముందు జరిగే బీఏసీ సమావేశంలో అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు.  నేటికీ రాష్ట్రంలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నందున ఈసారి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని సమావేశాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తెలిపారు.