బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈరోజు గవర్నర్ బేబీ రాణీ మౌర్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఆయన పనితీరు పట్ల తరచూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరుస్తుండటం, ఆయనపై బిజెపి అధిష్టానానికి పిర్యాదులు చేస్తుండటంతో స్వయంగా ఢిల్లీ వెళ్ళి బిజెపి అధిష్టానాన్ని కలిసివచ్చిన తరువాత వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.
సాధారణంగా కాంగ్రెస్ లేదా ప్రాంతీయపార్టీల పాలిత రాష్ట్రాలలో ఇటువంటి రాజకీయ సంక్షోభం సృష్టించి అధికారం కైవసం చేసుకొనేందుకు బిజెపి ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేల వలననే రాజకీయ సంక్షోభం ఏర్పడటం విశేషం. అయితే ఉత్తరాఖండ్ శాసనసభలో 70 స్థానాలలో నేటికీ 57 బిజెపి చేతిలోనే ఉన్నందున ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు. త్రివేంద్ర సింగ్ స్థానంలో ధన్‌సింగ్ రావత్‌ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.