
ఈ ఆగస్ట్ 15వ తేదీకి భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృతి మహోత్సవ్’ పేరిట మార్చి 12 నుంచి ఆగస్ట్ 15వరకు 75 వారాలపాటు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. వారితో ప్రధాని నరేంద్రమోడీ నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యి ఈ ఉత్సవాల నిర్వహణ గురించి చర్చించారు. అనంతరం సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్సవాల నిర్వహణ గురించి అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రామాచారిని, సభ్యులుగా వివిదశాఖల ముఖ్యకార్యదర్శులను నియమించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో... ముఖ్య ప్రాంతాలలో మొత్తం 75 భారీ త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేయాలని, ప్రజలలో దేశభక్తి, జాతీయస్పూర్తిని పెంపొందించేవిదంగా సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, సాహితీ, కవి సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్దులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలు నిర్వహించాలని సిఎం కేసీఆర్ సూచించారు. ఈనెల 12వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉదయం 11 గంటలకు త్రివర్ణ పతాకాలు ఎగురవేసి ఉత్సవాలు ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరుగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.