25.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన సిఎం కేసీఆర్, రెండు సీట్లను టిఆర్ఎస్ గెలుచుకోబోతోందని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు చేసుకొన్న పట్టభద్రులలో 60 శాతం మంది టిఆర్ఎస్ మద్దదుదారులే కనుక వారి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే అవలీలగా గెలుస్తామని, మిగిలిన 40 శాతం ఓట్ల కోసమే కాంగ్రెస్, బిజెపిలు పోరాడుకొంటాయని సిఎం కేసీఆర్ అన్నారు. కనుక ఆ రెండు పార్టీలు టిఆర్ఎస్ దరిదాపుల్లోకి కూడా రాలేవన్నారు.
సిఎం కేసీఆర్ లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ కాంగ్రెస్, బిజెపి, స్వతంత్ర అభ్యర్ధులకు ఎవరి లెక్కలు వారికున్నాయి. ఈ ఎన్నికలలో తాము తప్పకుండా గెలుస్తామనే ధీమతోనే బరిలో దిగారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు కనుకనే సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ అభ్యర్ధిని నిలబెట్టకుండా స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని బరిలో దింపారని రేవంత్ రెడ్డి తదితరులు వాదిస్తున్నారు. ఓడిపోయే సీటు కనుకనే సిఎం కేసీఆర్ దానిని ఆమెకు ఇచ్చి ఆ ఓటమిని పీవీ కుటుంబం ఖాతాలో వేసి సిఎం కేసీఆర్ అప్రదిష్టను తప్పించుకోవాలనుకొంటున్నారని రేవంత్ రెడ్డి వాదన. అంటే ఆ సీటును తాము తప్పకుండా గెలుచుకోబోతోందని కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఈ స్థానానికి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కనుక ఆయన కూడా మళ్ళీ తప్పకుండా గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. బహుశః రేవంత్ రెడ్డి కూడా ఆయనే గెలుస్తారని భావిస్తునందునే టిఆర్ఎస్ ఓటమి తప్పదని వాదిస్తున్నారేమో?కనుక రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి కాంగ్రెస్ లేదా బిజెపి గెలుచుకొనే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి.
కానీ ఎన్నికలలో తప్పకుండా మనమే గెలుస్తామని పార్టీలో అందరికీ నమ్మకం కలిచించే బాధ్యత అధినేతదే కనుక సిఎం కేసీఆర్ ఆవిదంగా లెక్కలు కట్టి చెప్పారేమో? సిఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్లలో ఎవరి లెక్కలు ఫలిస్తాయో తెలియాలంటే మార్చి 17న ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే!