
ఉద్యోగులు, కార్మికులు తమ జీవితకాలం కష్టపడి సంపాదించుకొని దాచుకొన్న సొమ్ము ప్రావిడెంట్ ఫండ్...పదవీ విరమణ తరువాత శేషాజీవితం కోసం లేదా ఏ కారణం చేతైన ఉద్యోగం మానేసినా లేదా అకాలమరణంతో కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశ్యంతో నెలనెలా జీతంలో నుంచి కొంచెం కొంచెం తీసి దాచుకొనే ఆ సొమ్ముపై కూడా కేంద్రప్రభుత్వం కన్ను పడిందిప్పుడు.
ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ జమా అయ్యే పీఎఫ్ సొమ్ముపై ఇచ్చే వడ్డీపై పన్ను విధించబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు 2021 బడ్జెట్లోనే ఆ ప్రతిపాదన చేర్చారు కూడా. అయితే ఏడాదికి రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ జమా అయ్యే పీఎఫ్ సొమ్ముపై ఇచ్చే వడ్డీపై ఎటువంటి పన్నులు విధించబోమని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమలుచేస్తామని చెప్పారు.
ఇప్పటివరకు పీఎఫ్ సొమ్ముపై ఇచ్చే వడ్డీపై ఎటువంటి పన్నులు లేవు. కానీ ఇక నుంచి వార్షికవేతనం రూ.20.83 లక్షలున్నవారు ఆదాయపన్నుతో పాటు వారు దాచుకొంటున్న పీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీకి కూడా పన్ను చెల్లించవలసి ఉంటుందన్నమాట!
దీంతో చాలామంది కేంద్రరాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, ఐటి, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తదితరులు కొంత నష్టపోక తప్పదు. కష్టపడికూడబెట్టుకొన్న సొమ్ముపై వచ్చే ఏదో కొంచెం వడ్డీ వస్తోందనుకొంటే అదికాస్త పన్ను రూపంలో ఆవిరైపోయేలా ఉంది. వడ్డీపై ఎంత పన్ను విధించబోతున్నారనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.