ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రచారకర్తల నియామకం

ఈనెల 14వ తేదీన జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారకర్తలను, సమన్వయకర్తలను నియమించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లను ప్రచారకర్త, సమన్వయకర్తలుగా నియమించారు. అదేవిదంగా వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఆదివాసీ కమిటీ జాతీయ వైస్‌ ఛైర్మన్ బెల్లయ్య నాయక్‌లను ప్రచారకర్త, సమన్వయకర్తలుగా నియమించారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో టిఆర్ఎస్‌ శరవేగంగా పతనం అవుతోంది. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల గాలి బుడగ వంటిదే. నా రాజకీయ అనుభవం, రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం వచ్చే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను గెలిపించవలసిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.