ఓవైసీకి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం

మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికలలో మజ్లీస్‌ పార్టీ కూడా పోటీ చేసేందుకు సిద్దమైంది. కనుక ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న మేటియాబ్రజ్ అనే ప్రాంతంలో గురువారం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలనుకొన్నారు. కానీ శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో ఆయన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో ఆ సభను రద్దు చేసుకోవలసి వచ్చింది.

దీనిపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నా ఎన్నికల సభను అడ్డుకొనేందుకు ప్రభుత్వానికి, పోలీసులకు ఏమి హక్కుంది?గోద్రా ఘటన జరిగినప్పుడు ఈ మమతా బెనర్జీ ఎక్కడున్నారు?బిజెపి ఇక్కడ 18 సీట్లు గెలుచుకొంది. మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ నన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తాను. తృణమూల్ కాంగ్రెస్‌ నేతలు ద్వందవైఖరితో వ్యవహరిస్తుంటారు. ఇక్కడ నిత్యం కేంద్రప్రభుత్వం, బిజెపిలపై విమర్శిస్తుంటారు. కానీ ఢిల్లీలో వాటికి విధేయంగా నడుచుకొంటుంటారు,” అని ఆక్షేపించారు.