
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో అధికార, ప్రతిపక్షాల మద్య మాటలయుద్ధం మొదలైంది.
ఆ స్థానంలో టిఆర్ఎస్‌కు గెలిచే అవకాశం లేదని గ్రహించినందునే సిఎం కేసీఆర్ ఆమెకు టికెట్ ఇచ్చి బరిలో దింపారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ టిఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని భావించి ఉంటే ఆమెకు టికెట్ ఇచ్చేవారేకారని ఆరోపించారు. ముందే ఓటమిని పసిగట్టిన సిఎం కేసీఆర్ ఆ ఓటమిని పీవీ కుటుంబ ఖాతాలో వేసి అపనింద తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమెకు టికెట్ ఇచ్చారు తప్ప స్వర్గీయ పీవీపై గౌరవంతో కాదని అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్గీయ పీవీ నరసింహారావు ఫోటో పెట్టుకొని టిఆర్ఎస్ ఓట్లు అడుక్కోవడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
కాంగ్రెస్ విమర్శలపై టిఆర్ఎస్ నేతలు కూడా ధీటుగా స్పందించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తదితరులు నిన్న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్, బిజెపిలు ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన పార్ధివదేహాన్ని దర్శించుకొని నివాళులు అర్పించుకొనేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచేందుకు కూడా అనుమతించలేదు. ఓ అనాధ శవంలా హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ అంత్యక్రియలు జరిపారు. అదికూడా సక్రమంగా జరిపించకుండా వెళ్ళిపోయారు. స్వర్గీయ పీవీ పట్ల కాంగ్రెస్ నేతలకు ఎంత గౌరవం ఉందో దీంతో అర్దమవుతుంది. కానీ తెలంగాణ బిడ్డడైన స్వర్గీయ పీవీని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ఏడాది పొడవునా ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గౌరవించింది. మా పార్టీ నిబద్దతకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?” అంటూ కాంగ్రెస్ నేతలను ఎదురు ప్రశ్నించారు.