ఈరోజు మహబూబాద్‌లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుటే కాంగ్రెస్ నేతలు కీచులాడుకొన్నారు. మార్చి 14వ తేదీన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నందున ఇవాళ్ళ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాములు నాయక్, జిల్లాకు చెందిన మరికొందరు సీనియర్ నేతలు ఎన్నికల సన్నాహక సభ పెట్టుకొన్నారు.
ఆ సభలో రాములు నాయక్ సభలో ఒకరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తూ చివరిగా డోర్నకల్‌కు చెందిన నెహ్రూ నాయక్ పేరును పిలిచారు. దాంతో ఆయన అనుచరులు రాములు నాయక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. డోర్నకల్కే చెందిన కాంగ్రెస్ నేత రాంచంద్రునాయక్ అనుచరులు నెహ్రూ నాయక్ డౌన్ డౌన్...గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఇరువర్గాల మద్య కాసేపు తిట్లు, తోపులాటలు జరిగాయి.
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్ వారిస్తున్నప్పటికీ ఇరువర్గాలు వెనక్కు తగ్గకుండా నినాదాలు చేస్తుండటంతో ఎన్నికల సన్నాహకసభ రసాభాసగా మారింది. చివరికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మైక్ తీసుకొని ఇరువర్గాలను గట్టిగా హెచ్చరించడంతో అందరూ చల్లబడ్డారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చించారు.
అయితే పార్టీలో నేతలు ఈవిదంగా కీచులాడుకొంటుంటే టిఆర్ఎస్, బిజెపిలను ఏవిదంగా ఎదుర్కొని ఓడించగలరు? వారిలో వారికే సక్యత లేకపోతే ఎన్నికలలో ఏవిదంగా కలిసికట్టుగా పనిచేయగలరు?