కొత్త సచివాలయం ఎదుట రెండు భారీ ఫౌంటేన్‌లు

కొత్తగా నిర్మించబోతున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆవరణలో 16 అడుగుల ఎత్తుగల రెండు భారీ ఫౌంటేన్‌లు ఏర్పాటుచేయబోతున్నారు. ఢిల్లీలో పార్లమెంటు భవనం ఎదుట ఉన్న ఫౌంటేన్ వంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్‌ సూచించడంతో రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు,  కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న షాపూర్‌జీ పలోమ్‌జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు శుక్రవారం ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు ఎదుట ఉన్న ఫౌంటేన్‌ను పరిశీలించారు. 

సువిశాలమైన పార్లమెంటు భవనానికి తగ్గట్లుగా 50 అడుగుల ఎత్తుతో ఒక ఫౌంటేన్‌ ఏర్పాటుచేశారు. కానీ తెలంగాణ సచివాలయానికి 16 అడుగుల ఎత్తు ఉన్న రెండు ఫౌంటేన్‌లను ఏర్పాటు చేస్తే అందంగా ఉంటుందని వారు నిర్ణయించారు. పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటేన్‌కు వినియోగించిన రాజస్థాన్‌లోని ధోల్పూర్ ఎర్రరాతి పలకలనే వీటికి కూడా వాడాలని నిర్ణయించారు. ఆ రాతి పలకాలతో ఫౌంటేన్‌ తయారుచేస్తున్న శిల్పితో వారు నిన్న మాట్లాడారు. 

కొత్త సచివాలయంలో క్రింద అంతస్తులలో గోడలకు, భవనం బయట ఫుట్‌పాత్‌కు సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ధోల్పూర్ ఎర్రరాతి పలకలనే వినియోగించాలని ముందే నిర్ణయించారు. కనుక ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం అక్కడి నుంచి రాజస్థాన్‌లోని ధోల్పూర్, కరోలీ క్వారీల వద్దకు వెళ్ళి పరిశీలించనున్నారు. అక్కడి క్వారీల నుంచి ఎర్రరాతి పలకలను హైదరాబాద్‌కు రప్పించబోతున్నారు.