ప్రత్యక్ష పద్దతిలో విచారణలు చేపట్టనున్న హైకోర్టులు

 కరోనా కారణంగా గత ఆరేడునెలలుగా దేశంలో అన్ని న్యాయస్థానాలు వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారా విచారణలు జరుపుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినందున అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ మళ్ళీ పాత పద్దతిలో ప్రత్యక్ష విచారణలు చేపట్టాలని కేంద్రహోంశాఖ సూచించింది. దీనికి సంబందించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి మార్చి 19వరకు ప్రయోగాత్మకంగా కొన్నిరోజులు ప్రత్యక్షంగా కొన్ని రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టాలని సూచించింది. కేంద్రహోంశాఖ సూచనల మేరకు రాష్ట్ర హైకోర్టులో వారంలో రెండేసి రోజులు చొప్పున నలుగురు న్యాయమూర్తులు ప్రత్యక్ష విచారణలు చేపడతారు.  

 సోమ, మంగళవారాలలో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పనిచేస్తుంది.  వారితోపాటు జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరాం కూడా ప్రత్యక్ష పద్దతిలో విచారణలు చేపడతారు. 

బుద, గురువారాలలో జస్టిస్ ఎంఎస్‌ రామచందర్‌ రావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పనిచేస్తుంది. వారితోపాటు జస్టిస్ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌ నాథ్‌గౌడ్‌లు కూడా ప్రత్యక్ష పద్దతిలో విచారణలు చేపడతారు. 

అదేవిదంగా శుక్రవారం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌లతో కూడిన ధర్మాసనం పనిచేస్తుంది. వారితోపాటు జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డిలు ప్రత్యక్ష పద్దతిలో విచారణలు చేపడతారు. 

వీరందరూ తమకు కేటాయించిన రెండురోజులలో ప్రత్యక్ష విధానంలో, మిగిలిన రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుంటారు.  

జస్టిస్ పి.కేశవరావు ఒక్కరే వారంలో ఆరురోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుంటారు. 

మార్చి 1వ తేదీ నుంచి జిల్లా స్థాయి న్యాయస్థానాలలో కూడా ప్రత్యక్ష పద్దతిలో విచారణ చేపట్టనున్నాయి.