కేసుల విచారణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

బిజెపి నాయకురాలు విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ఫేస్‌బుక్‌లో విమర్శలు గుప్పించారు. మంథనిలో లాయర్ దంపతులను పట్టపగలు హత్యచేయడంపై ఆమె స్పందిస్తూ, “అధికార పార్టీ నేతలు చాలా సందర్భాలలో నిందితులను తప్పించడం, బలహీనమైన చార్జిషీట్లు వేయించి, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అనేకమంది నేరం చేసి కూడా బయటపడుతున్నారు. అదే విధంగా ఏదో ఒక కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న నేరస్తుల కేసులను పై కోర్టులలో అప్పీలు చెయ్యకుండా ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరించడం అత్యంత దారుణం. విచారణలో తప్పించుకున్న క్రిమినల్స్ మరల దారుణమైన నేరాలకు పాల్పడుతుండటం చూస్తున్నాము. తెలంగాణలో ఇంతవరకూ అప్పీళ్ళకు పోని నేరారోపిత కేసుల వివరాలు మొత్తం ప్రభుత్వం ప్రకటించి, అందుకు కారణాలేమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఆ విధంగానైనా ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది,” అని తన మెసేజ్‌లో పేర్కొన్నారు.